కాంగ్రెస్ గెలుపునకు తెలుగు తమ్ముళ్లు చేసిన కృషి మరవలేనిద : పొంగులేటి - ponguleti thanks to CBN
Published : Feb 1, 2024, 3:52 PM IST
Minister Ponguleti Thanks to TDP Leaders : తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు నియంతను ఓడించేందుకు 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపునకు తెలుగు తమ్ముళ్లు చేసిన కృషి మరవలేనిదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఆయన పలు పార్టీల కార్యాలయాలకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా, సీపీఐ, తెలుగుదేశం పార్టీల జిల్లా కార్యాలయాలకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని, ఎలాంటి రాజకీయ లబ్ధి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీకి సహాయం చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగు తమ్ముళ్లు అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పని చేశారన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఇక ముందు కూడా అన్ని ఎన్నికల్లో కలిసి పని చేద్దామని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకునే ప్రభుత్వం తెచ్చేందుకు టీడీపీ నాయకులు చాలా కృషి చేశారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తెలంగాణలో భవిష్యత్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంగ్రెస్ నేతలు కలిసి ప్రయాణం చేద్దామన్నారు.