చిత్తూరు రోడ్డు ప్రమాదం - బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి - Ramprasad on Chittoor Bus Accident
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2024, 8:15 PM IST
Ramprasad on Road Accident in Chittoor : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. క్షతగాత్రులకు ఒక లక్ష ఇస్తామని చెప్పారు. ఈ ఘటనలో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి బీమా ద్వారా రూ.80 లక్షల వరకు అందుతాయని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Chittoor Bus Accident Updates : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. రహదారులపై బ్లాక్ స్పాట్స్ గుర్తించేెందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏపీని యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని వివరించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. విజయవాడ వరదల బాధితులను 20 నిమిషాల పాటు పరామర్శించి ఆయన రాజకీయాలు చేస్తున్నారని మండిపల్లి ధ్వజమెత్తారు.