మద్ధతు ధర ఇచ్చే విషయంలో రైతులను వేధిస్తే కఠిన చర్యలు : కోమటి రెడ్డి వెంకటరెడ్డి
Published : Mar 20, 2024, 5:07 PM IST
Minister Komatireddy Venkat Reddy Fires On BRS : రాష్ట్రంలో పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలే ఇప్పుడు కరవు రూపంలో వెంటాడుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు దేవాలయాల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో నల్గొండతో పాటు దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అందుకే 36 సీట్లతో భారీ మెజార్టీతో గెలుచుకున్నామన్నారు.
పంట నష్టంపై అంచనా వేసి రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు. మిల్లర్లకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తున్నా వారి ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదన్నారు. బహిరంగ మార్కెట్లో ఇష్టానుసారంగా బియ్యం ధరలు పెంచి అమ్ముకుంటున్న మిల్లర్లు రైతులకు మద్ధతు ధర ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మద్దతు ధర ఇచ్చే విషయంలో రైతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా మిల్లుల్ని సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. లక్షల కోట్ల అప్పులు చేసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పాఠశాలల్లో మరుగుదొడ్లు కూడా కట్టించలేకపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన ప్రగతిని చూస్తారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మళ్లీ ఓట్లు వేసే పరిస్థితి వస్తుందని అన్నారు.