బావమరిది కోసం బావ ప్రత్యేక పూజలు - మోకాళ్లపై నడిచి ఐనవోలు మల్లన్నకు మొక్కులు - MAN WALKS ON KNEES IN INAVOLU - MAN WALKS ON KNEES IN INAVOLU
Published : May 26, 2024, 2:09 PM IST
Man prayed for Brother in law Health in Mallanna Temple : బావమరిది ఎప్పుడు బావ మంచే కోరతాడనేది పూర్వీకుల మాట. కానీ ఇక్క ఓ బావ తన బావమరిది కోసం ఏకంగా మోకాళ్లపై నడిచి వెళ్లి ఐనవోలు మల్లన్నకు మొక్కులు సమర్పించాడు. ఇంతకీ ఈ బావా-బావమరుదుల కథ ఏంటో ఓసారి తెలుసుకుందామా?
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమరిది ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని కోరుకుంటూ అతడి బావ మోకాళ్లపై నడిచి మల్లన్న స్వామికి మొక్కలు సమర్పించుకున్నాడు. ఈ అరుదైన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలులో జరిగింది. కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి బావమరిది రజినీకాంత్ ఈ నెల 17వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదానికి గురైన తన బావమరిది కోలుకుంటే మోకాళ్లపై వచ్చి మొక్కలు సమర్పించుకుంటానని ఐనవోలు మల్లికార్జున స్వామి వారికి మొక్కుకున్నట్లు నాగరాజు తెలిపాడు.
రజినీకాంత్ ప్రమాదం నుంచి కోలుకోవడంతో మొక్కుకున్నట్లుగానే మల్లికార్జున స్వామికి మొక్కులు తీర్చుకున్నాడు నాగరాజు. మల్లన్న స్వామి ఆశీర్వాదంతో తన బావమరిది ప్రాణాలతో బయటపడ్డాడని మోకాళ్లపై నడుచుకుంటూ స్వామిని దర్శించుకున్నాడు. ఐనవోలు నంది కూడలి నుంచి గర్భాలయం వరకు మోకాళ్లపై నడిచి మొక్కులు చెల్లించుకున్నాడు. ఆయన్ను ఆలయ కార్య నిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు, అర్చకులు ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు.