నిద్రిస్తుండగా ఇల్లు కూల్చివేత - ప్రమాదవశాత్తు శిథిలాల కింద పడి వ్యక్తి మృతి - Man Died after House Demolition
Published : Feb 22, 2024, 12:31 PM IST
Man Dies In House Demolition : నిర్మాణంలో ఉన్న ఓ ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల కూకట్‌పల్లి మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్, తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు. కూల్చివేతకు ముందు రోజే ఆ ఇంటిలో అద్దెకు ఉన్న అందరినీ ఖాళీ చేయించారు.
Man Died after House Demolition : ఉదయం పాక్షికంగా కూల్చివేత పనులు చేపట్టగా, భోజన విరామ అనంతరం ఇంటిని పూర్తిగా కూల్చివేశారు. అయితే అదే ఇంటిలో ఉండే స్వామి రెడ్డి అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో వచ్చి ఖాళీ చేయించిన ఇంటిలో పడుకున్నాడు. అతడు ఇంట్లో ఉన్న విషయాన్ని గమనించకుండా కూల్చివేత చేపట్టడంతో, స్వామి రెడ్డి శిథిలాల కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.