అన్యాయంగా డిటైన్ చేశారని మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల ధర్నా - మద్దతు తెలిపిన మైనంపల్లి - Malla Reddy Students Protest
Published : Mar 18, 2024, 2:41 PM IST
|Updated : Mar 18, 2024, 5:28 PM IST
Mallareddy College Agriculture University Students Protest : హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, చదువు విషయంలో కనీస నిబంధనలు పాటించకుండా, అశ్రద్ద వహిస్తున్నారని వాపోయారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ, విద్యార్థుల చదువు విషయంలో లేదని యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సుమారు 50 మందిని డీటైన్ చేశారని, పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా అధికారులు స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారని ధర్నాకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు మద్దతు తెలిపారు. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.