గర్భిణీని తీసుకెళ్తున్న అంబులెన్స్ బ్లాస్ట్- స్మార్ట్‌గా ప్రాణాలు కాపాడిన డ్రైవర్
Published : Nov 14, 2024, 3:31 PM IST
Maharashtra Ambulance Blast Video : మహారాష్ట్రలో ఓ గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ రహదారిపై ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయింది. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ధరన్‌గావ్-జల్గావ్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదీ జరిదింది!
గర్భిణీని తీసుకెళ్తున్న క్రమంలో డ్రైవర్ గేర్ మారుస్తుండగా ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. దీంతో అంబులెన్స్‌లో పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన డ్రైవర్ రాహుల్ భవిష్కర్ ధరన్‌గావ్-జల్గావ్ జాతీయ రహదారిపై గుజ్రాల్ పెంట్రోల్ పంప్ వద్ద అంబులెన్స్‌ను ఆపాడు. అనంతరం గర్భిణీ సహా ఆమెతో ఉన్న కుటుంబసభ్యులను కిందకు దించాడు. అనంతరం క్రమంగా వాహనంలో మంటలు ఎక్కువై అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్లకు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధంతో అంబులెన్స్ పేలి పోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే పేలుడు ధాటికి స్థానికంగా ఉన్న ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం సమయంలో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రహదారిని తాత్కాలికంగా మూసివేసి ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.