'మీరు అల్లరి చేస్తే నేను చచ్చి పోతా' - పొరపాటున చీర మెడకు బిగుసుకుపోయి తండ్రి మృతి - Loco Pilot Unexpected Death - LOCO PILOT UNEXPECTED DEATH
Published : Jul 19, 2024, 1:05 PM IST
Loco Pilot Unexpected Death in Visakhapatnam : 'మీరు అల్లరి చేస్తే.. నేను చచ్చి పోతా' అంటూ పిల్లల అల్లరి మాన్పించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం చివరికి ఆయన ప్రాణాల్నే బలిగొంది. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి పట్టణంలోని 89వ వార్డు కొత్త పాలెంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. అయితే నిన్న(గురువారం) రాత్రి కుమార్తె (7), కుమారుడు(5) ఆయన చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను తీసి చించేశారు. దీంతో కోపోద్రిక్తుడైన చందన్‌కుమార్ పిల్లలపై చిరాకు పడ్డారు. వెంటనే భార్య అడ్డుపడింది.
ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవైంది. తనకు ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్‌కుమార్ బెదిరించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో ఆయన ఇంట్లోని ఫ్యాన్‌కు చీర కట్టి, దాన్ని మెడకు చుట్టుకుని కుటుంబసభ్యుల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. అంతలో పొరపాటున చీర మెడకు బిగుసుకుపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడేందుకు భార్య ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.