హైదరాబాద్‌లో ఫార్మా సూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా : కిషన్ రెడ్డి - Kishan Reddy On Pharma Sector - KISHAN REDDY ON PHARMA SECTOR
Published : Jul 7, 2024, 9:57 PM IST
Kishan Reddy On Pharma Sector : కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇప్పటివరకు దేశంలో లేని ఫార్మాసూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతానికి యూనివర్సిటీని తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 73వ ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ ఎక్స్‌పో కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఫార్మాస్యూటికల్ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నగరం ముందుందని కిషన్‌రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్లకు సంబంధించి ప్రపంచానికే హైదరాబాద్ 60 శాతం కంటే ఎక్కువగా సరఫరా చేస్తుందని తెలిపారు. మారుతున్న జీవన విధానంలో అనేక రకాల కొత్త వ్యాధులు వస్తున్న తరుణంలో పరిశోధన అభివృద్ధికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఈ రంగం ద్వారా విదేశ మారకద్రవ్య నిల్వలు పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత్ ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ఈ సదస్సులో ఐపీసీఏ ఛైర్మన్ పార్థసారథిరెడ్డి సహా పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు, ఫార్మా శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫార్మాసూటికల్ కాంగ్రెస్ సదస్సు ద్వారా దాదాపు 2 వేల మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పార్థసారథిరెడ్డి వెల్లడించారు.