వారం రోజులుగా చక్కర్లు కొడుతున్న జెట్ విమానం - భయాందోళనలో గ్రామస్థులు - Jet Airplane Circling in Telangana
Published : Mar 19, 2024, 3:37 PM IST
Jet Airplane Roam in Peddapalli District : పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లోని పలు గ్రామాలపై వారం రోజులుగా ఒక జెట్ విమానం తక్కువ ఎత్తులో చక్కర్లు కొడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఈ విమానాన్ని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నా, మరోవైపు భయాందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా మండలాల్లోని ఆయా గ్రామాల మీదుగా ఈ విమానం తక్కువ ఎత్తులో తిరుగుతుండడంతో అందరినీ కలవరపెడుతోంది.
Jet Airplane Circling in Manthani : విమానం ఎక్కడి నుంచి వస్తుందో ఎటు పోతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి సంబంధించి అధికారులను, పోలీసులను ప్రశ్నించగా వారి వద్ద కూడా సమాచారం లేదని చెబుతున్నారు. ఈరోజు ఉదయం భారీ శబ్దంతో ఇళ్ల సమీపంలో తక్కువ ఎత్తులో విమానం ఎగురుతుండడంతో పోలీసు అధికారులు అప్రమత్తమై సమాచారాన్ని సేకరిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ విమానం తిరుగుతుండడంతో గ్రామస్థులు సైతం అది ఎందుకు చక్కర్లు కొడుతోందని తెలుసుకునేందుకు అత్యుత్సాహంతో ఉన్నారు.