పంద్రాగస్ట్ వేడుకలకు ముస్తాబైన గోల్కొండ - మువ్వన్నెల కాంతులతో మిలమిల - INDEPENDENCE DAY AT GOLCONDA FORT - INDEPENDENCE DAY AT GOLCONDA FORT
Published : Aug 14, 2024, 10:06 AM IST
Independence Day Arrangements at Golconda Fort : రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు చారిత్రక కోట గోల్కొండలో చురుగ్గా సాగుతున్నాయి. కోటను మంగళవారం రాత్రి ఘనంగా విద్యుత్ దీపాలతో ధగధగమనిపించేలా అలంకరణ చేశారు. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింభించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు దేదీప్యమానంగా వెలిగేలా ముస్తాబు చేశారు. మువ్వన్నెల కాంతుల సొబగులతో గోల్కొండ ఖిల్లా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. జెండా వందనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం రానున్న నేపథ్యంలో భద్రతా పరంగా తగిన చర్యలు చేపడుతున్నారు. వేడుకలకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా పోలీసులు సూచించిన ప్రాంతాల్లో వెహికల్స్ను పార్కింగ్ చేయాలని, ట్రాఫిక్ మళ్లింపులను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలీస్ పరేడ్ రిహార్సల్స్ కూడా జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.