ఇండ్ల కూల్చివేతతో ముషీరాబాద్‌లో టెన్షన్ టెన్షన్
Published : Jan 29, 2024, 12:08 PM IST
|Updated : Jan 29, 2024, 4:48 PM IST
Houses Demolition in Musheerabad : హైదరాబాద్ ముషీరాబాద్‌లో జీహెచ్ఎంసీ అధికారులు ఇళ్లను కూల్చి వేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్ దాదాపు 70 ఏళ్లుగా చిన్నపాటి ఇల్లు నిర్మించుకొని ఉంటున్న తమ ఇళ్లను బలవంతంగా ఎమ్మార్వో అధికారులు కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా రెవెన్యూ అధికారులు బలవంతంగా పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. సామాన్లు ఉన్నప్పటికీ అలాగే ఇళ్లను కూల్చివేస్తున్నారని బాధితులు విలపిస్తున్నారు.
బాధితులను ఓదార్చడానికి వచ్చిన ధరణి విచారణ కమిటీ ఛైర్మన్ కోదండ రెడ్డి పరామర్శిస్తున్న సమయంలో పోలీసులు ఆయణ్ను నెట్టి వేశారు. దీంతో కోదండ రెడ్డి చేతికి స్వల్ప గాయం అయింది. బాధితులకు జీహెచ్ఎంసీ ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేస్తుందని వారు ఆరోపించారు. పేదలకు పునరావాసం కల్పించకుండా ఇళ్లను కూల్చివేసి, రోడ్డుమీద వేయడం సభం కాదని స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు బాధితులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వారి వద్ద నుంచి పెట్రోల్ బాటిల్ లాక్కొని అదుపులో తీసుకున్నారు. భారీ పోలీసుల పహారా మధ్య ఇళ్ల కూల్చివేత కొనసాగడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.