కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ - ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం - ఆర్ అండ్ బీ శాఖ బిల్లులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 10:26 AM IST
High Court Fired on AP Government: రహదారులు, భవనాల నిర్మాణ పనులను చేపట్టిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుల చెల్లింపునకు గతేడాది మే 11న ఉత్తర్వులు జారీచేశామని, వాటిని ఇంత వరకు అమలు చేయలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసిన న్యాయస్థానం, ఈ లోపు బిల్లులు చెల్లించాలని తేల్చి చెప్పింది. న్యాయమూర్తి జస్టిస్ వి. సుజాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన తమకు బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు గుత్తేదారులు హైకోర్టును ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు గతేడాది మేలో ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఉత్తర్వులను అధికారులు లెక్కచేయకపోవడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అధికారులు ఉల్లంఘించారని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. పిటిషనర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్వరలో ఎన్నికల కోడ్ వస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో అసహనం వ్యక్తంచేసిన న్యాయమూర్తి, ఎన్నికల కోడ్‌కు ముందే బిల్లులు చెల్లించాలని తేల్చిచెప్పారు. విఫలమైతే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి హాజరుకావాలని స్పష్టం చేశారు.