10 Percent Liquor Shop Licenses To Geetha Communities : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గీత కార్మిక కులాలకు కేటాయించిన 10 శాతం మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా శెట్టిబలిజ, ఈడిగ, గౌడ, యాత, గౌడ్, శ్రీశయన, శెగిడి, గౌండ్ల, గామల్ల కులాలకు మొత్తం 335 మద్యం దుకాణాలను రిజర్వు చేశారు. అదేవిధంగా ఏ జిల్లాలో ఏ ఉప కులానికి ఎన్ని షాపులు కేటాయించాలో కూడా నిర్ణయించారు. వీటికి సంబంధించి ఎక్సైజ్‌శాఖ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసి వాటిని ప్రభుత్వానికి పంపింది.
ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. వీటితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండే సొండి కులస్థులకు 4 దుకాణాలను కేటాయిస్తారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటనలో భాగంగా ఓ కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు వారికి ఒక దుకాణాన్ని రిజర్వు చేయనున్నారు. వీటి నోటిఫికేషన్లు, విధివిధానాలు వేరువేరుగా ఖరారు చేస్తారు. గీత కార్మిక కులాల కోసం కేటాయించిన మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, లైసెన్సుల కేటాయింపు ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది. అనతరం ఫిబ్రవరి మొదటి వారంలోగా అవి ప్రారంభమయ్యేలా చూడనున్నారు.
లైసెన్సు రుసుము సగమే..
గీత కార్మిక కులాలకు రిజర్వు చేసిన మద్యం దుకాణాలకు ఆర్‌ఈటీ రూపంలో వసూలు చేసే లైసెన్సు రుసుము అన్ రిజర్వుడు దుకాణాల లైసెన్సు ఫీజులో సగం మాత్రమే ఉంటుంది. అన్ రిజర్వుడు కేటగిరీలో ఉన్న దుకాణాలకు ఆయా ప్రాంతాల జనాభాను బట్టి రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకూ లైసెన్సు రుసుము వసూలు చేస్తున్నారు. కానీ గీత కార్మికుల కోసం కేటాయించిన దుకాణాలకు మాత్రం అందులో సగం రూ.25 లక్షల నుంచి రూ.42.50 లక్షలు మాత్రమే ఉండనుంది. ఈ గీత కార్మిక కులాలకు కేటాయించిన దుకాణాలకు 2026 సెప్టెంబరు 30వ తేదీ వరకూ లైసెన్సులు జారీ చేయనున్నారు.
ఈ సూచనలు తప్పనిసరి :
- ఒకే వ్యక్తి ఒక దుకాణానికే కాకుండా వేర్వేరు దుకాణాలకు సైతం ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. దీనికి తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా ఉంటుంది.
- చివరికి ఒక వ్యక్తికి ఒక దుకాణం మాత్రమే కేటాయిస్తారు. అంతకంటే ఎక్కువ వచ్చినా వాటిని రద్దు చేస్తారు.
- దరఖాస్తుదారులు వాటితోపాటు కుల ధ్రువీకరణ పత్రాలు సైతం జత చేయడం తప్పనిసరి
- దరఖాస్తులన్నింటినీ లాటరీ ప్రకారం తీసి చివరికి లైసెన్సుదారును ఎంపిక చేస్తారు.