ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 1:45 PM IST

ETV Bharat / videos

వెంకటరెడ్డి నియామకంపై హైకోర్టులో పిటిషన్‌- విచారణ మార్చి 27కు వాయిదా

High Court Adjourned For Venkata Reddy Case: గనులశాఖ సంచాలకులుగా వీజీ వెంకటరెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఏపీ మైనింగ్‌ సర్వీసు నిబంధనల ప్రకారం అర్హత లేనప్పుడు వెంకటరెడ్డిని ఏవిధంగా నియమించారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. వెంకటరెడ్డితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 27కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌. రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

వెంకటరెడ్డి నియామక జీవోను రద్దు చేయాలని గుంటూరు జిల్లాకి చెందిన టి.గంగాధర్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. వెంకటరెడ్డి నియామకానికి వీలుగా సవరించిన మైనింగ్‌ సర్వీసు నిబంధనలను రద్దు చేయాలని కోరారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది చుక్కపల్లి భానుప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో సివిలియన్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా (Indian Coast Guard Civilian Staff Training Officer) వెంకటరెడ్డి పని చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత ఆయనను పాఠశాల విద్యాశాఖలోకి తీసుకొచ్చి, అనంతరం గనులశాఖ సంచాలకులుగా నియమించారని తెలిపారు. నిబంధనల ప్రకారం గనులశాఖలో సంచాలకులుగా నియమితులయ్యే వ్యక్తి ఆ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కనీసం రెండేళ్లు పనిచేయాలని చెప్పారు. ఏడీ హోదాలో వెంకటరెడ్డి పని చేయనందున ఆయన నియామక జీవోపై స్టే విధించాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details