శనిగరం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి - మైమరపిస్తున్న మత్తడి సోయగం - Sanigaram PROJECT - SANIGARAM PROJECT
Published : Sep 18, 2024, 11:23 AM IST
Tourists At Sanigaram Project : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి మోయతుమ్మెద వాగు ప్రవాహం పెరిగడంతో ప్రాజెక్టు మత్తడి పోస్తోంది. ఎగువ ప్రాంతంలోని గుట్టల మధ్య వస్తున్న నీటితో శనిగరం ప్రాజెక్టు చూపరులను కట్టి పడేస్తోంది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో చెరువు అలుగు ప్రవాహం కాస్త తగ్గింది. పైనుంచి వస్తున్న కొద్దిపాటి జల సవ్వడులతో ప్రాజెక్టు నుంచి నీరు మత్తడి దూకుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు శనిగరం ప్రాజెక్టుకు తరలివస్తున్నారు.
ప్రాజెక్టు అందాలను చూస్తూ మత్తడి ప్రవాహం వద్ద జలకాలాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. గుట్టల మధ్యలో కనువిందు చేస్తున్న నీరు కిందకు జాలు వారుతుండడంతో ఆ నీటిలో తడుస్తూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లా పాపలతో కలిసి గంటలసేపు మత్తడి నీటిలో ఆడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ప్రాజెక్ట్ అందాలను తమ చరవాణిలో చిత్రీకరిస్తూ సామాజిక మధ్యమాల్లో పంచుకుంటున్నారు.