భారీ వర్షాలకు పుట్టుకొచ్చిన కొత్త జలపాతం - ఎక్కడ అంటే ? - New WaterFalls in Nagarkurnool
Published : Aug 20, 2024, 10:09 PM IST
New WaterFalls in Nagarkurnool District : భారీ వానలు కురిస్తే, కొండాకోనల్లో, అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తాయి. ఇలాగే సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు నాగర్కర్నూల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొత్త జలపాతం పుట్టుకొచ్చింది. ఎత్తయిన ప్రాంతం నుంచి నల్లటి రాళ్ల నడుమ పాలధారలా కిందకు జాలువారుతూ కనువిందు చేస్తోంది. ఇంతకీ ఎక్కడా ఆ జలపాతం అంటారా? నాగర్కర్నూల్ జిల్లాలో తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ శివారులో బిజినేపల్లి-తిమ్మాజీపేట రహదారికి ఆనుకుని ఏర్పడిన జలపాతం ప్రస్తుతం సందర్శకులను ఆకట్టుకుంటోంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా గుమ్మకొండ వద్ద ప్రధాన కాల్వను తవ్వారు. ప్రధాన కాల్వ కావడంతో అంచెలంచెలుగా సుమారు 60 అడుగుల లోతు వరకు కాల్వ నిర్మాణం చేపట్టారు. కాగా భారీ వర్షాలు కురవడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద నీరు కాల్వకు చేరుతోంది. ఎత్తయిన ప్రాంతం నుంచి రాళ్ల నడుమ కిందకు జారుతోంది. వరద నీరు కిందకు జాలువారే దృశ్యాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. జలపాతాన్ని చూసి ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు కేరింతలు కొడుతూ జలకాలాడుతున్నారు. సెల్ఫీలు తీసుకుని అందమైన దృశ్యాలను తమ ఫోన్లో బంధిస్తున్నారు.