తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యుల దాడి - డీఎంఈ ఆఫీసు వద్ద బైఠాయించిన బాధిత డాక్టర్ - Govt Doctors Fight in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 6:42 PM IST

Govt Doctors Fight in Hyderabad : హైదరాబాద్​లో ప్రభుత్వ వైద్యులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. కోఠిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ వైద్యుడిపై మరో తోటి వైద్యుడు దాడికి దిగారు. డీఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్, దాడికి పాల్పడ్డ వైద్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని, డీఎంఈకి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు బాధిత వైద్యుడు శేఖర్ తెలిపారు. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్ సిటీలో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాల్లో పని చేస్తున్న వాళ్లు హైదరాబాద్​కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయన్నారు.

ఈ బదిలీలను అడ్డుకునేందుకు ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు, డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేశ్, రాథోడ్, వినోద్ కుమార్​లు కుట్ర చేస్తున్నారని తెలిపారు. వీరు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులుగా చలామణి అవుతూ తనపై దాడి చేశారని తెలిపారు. తాను డీఎంఈకి వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకొని, తనపై దాడి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీలోనే తిష్ట వేశారని, వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకునేంత వరకు తాను డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని డాక్టర్ శేఖర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details