అక్రమార్కులకు వరంగా ఉచిత ఇసుక విధానం- వినియోగదారుల పడిగాపులు - Free sand policy irregularities
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2024, 12:36 PM IST
Free sand policy irregularities in kurnool District : ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు వరంగా మారింది. సరిపడా ఇసుక నిల్వలున్నా అధికారుల అలసత్వంతో వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలంలోని తుంగభద్ర నదికి అనుకొని ఉన్నా ఈర్లదిన్నె, కొత్తకోట, కె.సింగవరం సమీపంలో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. ఇసుక కావాల్సిన వారు టిప్పర్ లేదా ట్రాక్టర్ యజమానులను సంప్రదిస్తున్నారు. వినియోగదారుల ఆధార్ కార్డు తీసుకుని కర్నూలు గనులు, భూగర్భ వనరుల శాఖ డీడీ కార్యాలయం వద్ద టిప్పర్ డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు.
వంద మందికి టోకెన్లు ఇచ్చి ఒక్కో టిప్పర్ చొప్పున మాత్రమే ఇసుక ఇస్తున్నారు. లైన్‌లో ఉన్నా మిగిలిన టిప్పర్ యజమానులకు ఇసుక దొరకడం లేదు. ఓ వైఎస్సార్సీపీ నాయకుడు అధికారులతో కుమ్మక్కై ఇసుకను తమ పేరు మీద రాయించుకుంటున్నారని టిప్పర్ యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజూ ఆ నాయకుడి తరఫున కొంతమంది కూలీలు వచ్చి టోకెన్లు తీసుకుపోతున్నారని వాపోతున్నారు. తామంతా క్యూలైన్లో ఉన్నా ఇసుక అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.