Man Killed By His Father And Brother Rangareddy District : ఆస్తి కోసం స్నేహితుడ్ని కిరాతకంగా చంపిన మిత్రుడు. నగల కోసం వృద్దురాలిని మట్టు పెట్టిన దుండగులు. డబ్బు అగితే ఇవ్వలేదని తల్లిని హతమార్చిన కొడుకు.. ఇలా బంధాలు బంధుత్వాలతో సంబంధం లేకుండా మనుషులు అత్యాశతో ఆప్తులను దూరం చేసుకుంటున్న ఘటనలు కోకొల్లులు. ఇలాంటి అమానవీయ ఘటనల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అలాంటి అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపింది.
ఏం జరిగిందంటే : ఆస్తిలో తన భాగం తనకు ఇవ్వాలని అడుగుతున్నాడని పెద్ద కుమారుడితో కలిసి ఓ తండ్రి చిన్నకొడుకుని కడతేర్చాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా పొలంలోనే పూడ్చేశారు. 24 రోజుల తర్వాత వారంతటవారే పోలీసులకు లొంగిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గుడితండాలో చోటుచేసుకుంది.
మాడ్గుల సీఐ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గుడితండాకు చెందిన రాత్లావత్ లక్ష్మణ్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. లక్ష్మణ్ పెద్దకుమారుడు నరేష్, చిన్న కొడుకు సురేష్ (25)తో కలసి కొంతకాలంగా హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి వాంబే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ముగ్గురూ ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
తండ్రిని నరికి చంపిన కొడుకు - ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్
దసరా పండగకు ముగ్గురూ స్వగ్రామం గుడితండాకు వెళ్లారు. ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని సురేష్ తండ్రి లక్ష్మణ్‌ను బెదిరించాడు. ఇది మనసులో పెట్టుకున్న లక్ష్మణ్ అక్టోబర్ 13న రాత్రి నరేష్‌తో కలిసి మాంసం కొట్టే కత్తితో చిన్న కుమారుడు సురేష్ (25)ను అంతమొందించాడు. మృతదేహాన్ని ఆటోలో వేసుకుని సమీపంలో ఉన్న పొలంలో పూడ్చారు.
అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. లక్ష్మణ్, నరేష్ ఇద్దరూ బుధవారం సాయంత్రం మాడ్గుల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హత్య సంఘటన వివరించి లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాడ్గుల తహసీల్దార్ సమక్షంలో సురేష్ మృతదేహాన్ని పరీక్షకు పంపారు. నిందితులు ఇద్దరినీ రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.
ఏడాదిన్నర క్రితం హత్య- మందు బాటిల్ సాక్ష్యం- రెండు కేసుల్లో నిందితుడు ఒకరే