లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ- పేదల కోసం యుద్ధం చేస్తాం: విజయ్ కుమార్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 10:06 AM IST
Former IAS Officer Vijay Kumar Founded Liberation Congress Party: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో ప్రస్తుతం మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకుంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ (Liberation Congress Party) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికజన మహాసంకల్ప సభలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించినట్లు ఆయన ప్రకటించారు. పేదల కోసం యుద్ధం చేస్తామంటున్న అధికార పార్టీ పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకిచ్చి నిజాయితీని చాటుకోవాలని సవాల్ విసిరారు. జగన్ పేదల కోసం యుద్ధం చేస్తా అంటున్నారని తెలిపారు. దౌర్జన్యంగా లాక్కున్న వారికి ఆస్తులు చెందేలా చట్టాన్ని మార్చారని పేర్కొన్నారు. సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలని కోరారు. అసుపత్రులకు వెళ్లలేక గిరిజన మహిళలు చనిపోతున్నారు అని విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
గత సంవత్సరం జులై 23న ఐక్యతా జయపథం పేరుతో తిరుపతి జిల్లా తడ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విజయ్‌కుమార్ కాకినాడ జిల్లా తుని వరకు 2,729 కిలోమీటర్ల మేర నడిచారు. 147 రోజుల్లో 1250 గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి లక్షల మందిని కలిశారు. పాదయాత్రలో పేదల కష్టాలను తెలుసుకొని వినతి పత్రాలను తీసుకున్నారు.