శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం - ఒకేసారి వందల బోట్లతో మత్స్యకారుల చేపల వేట - Fishermen Hunting at Srisailam
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 9:59 AM IST
|Updated : Aug 14, 2024, 10:14 AM IST
Fishermen Hunting at Srisailam Project : ఎదురుగా ప్రవాహం వస్తుంటే ఎవరైనా భయపడిపోతారు. కానీ జలంతో కలిసి జీవించే మత్స్యకారులు ప్రవాహానికి ఎదురొడ్డి నిలబడటంలో ముందుంటారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎదుట జరిగిన సంఘటన మత్స్యకారుల స్థైర్యానికి ఉదాహరణగా నిలుస్తోంది. గేట్లు మూసివేయడానికి కొద్దిసేపటి ముందు చిన్నపాటి బోట్ల సాయంతో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లారు. గేట్లు మూసివేయగానే భారీగా చేపలు దొరుకుతాయనే ఆశతో సాహసోపేతంగా అక్కడికి చేరుకున్నారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సోమవారం నీటి విడుదల ఆగిపోవటంతో చిన్నపాటి బోట్లపై బయలుదేరి చేపలు వేటాడుతున్నారు మత్స్యకారులు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం నిలిచిపోవటంతో సోమవారం ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేశారు. దీంతో డ్యాం దిగువన ఉన్న ప్లంజ్‌పూల్‌లో చేపలను పట్టుకునేందుకు కృష్ణాతీరంలోని పాతాళగంగ, లింగాలగట్టు గ్రామాల్లోని మత్స్యకారులు పుట్టీల (చిన్నపాటి బోట్ల) పై బయలుదేరారు. ప్రాజెక్టు నుంచి దూకుతున్న నీటికి ఎదురెళ్లే పెద్ద చేపలు డ్యాం దిగువన ప్లంజ్‌పూల్‌లోకి చేరతాయి. వీటి కోసమే మత్స్యకారులు వలలతో వేట సాగించారు. ఒక్కొక్కరికి వలల్లో సుమారు 2 క్వింటాళ్ల వరకు చేపలు చిక్కాయని వారు తెలిపారు.