మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - భయంతో పరుగులు తీసిన రోగులు - Hospital Fire Accident - HOSPITAL FIRE ACCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 7:44 AM IST
Fire Accident in Venkozipalem Medicover Hospital Today : విశాఖ వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఒక్కసారిగా భారీ పొగలు కమ్ముకోవడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. మెడికవర్ ఆసుపత్రి సెల్లార్‌లో ఉన్న యూపీఎస్ బ్యాటరీల వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు కమ్ముకున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియక కొద్దిసేపు రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు.
ఆసుపత్రిలో పొగలు కమ్ముకోవడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు హుటహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రిలో అలుముకున్న పొగను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రిలో అందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. సెల్లార్‌లో ఉన్న బ్యాటరీలో షార్ట్ వద్ద సర్క్యూట్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. మంటలు రాకుండా కేవలం పొగలు మాత్రమే వచ్చాయని మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.