యాదాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలార్పిన ఫైర్ సిబ్బంది - Fire Accident In Yadadri - FIRE ACCIDENT IN YADADRI
Published : Jul 11, 2024, 10:54 AM IST
Fire Accident In Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం శివారు ప్రాంతంలోని ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఆకస్మిక పరిణామం స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల సమాచారం ప్రకారం : ధర్మోజి గూడెం శివారు ప్రాంతంలో ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమ ఉంది. ఉదయం ఒక్కసారిగా ఈ పరిశ్రమ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల నుంచి సమాచారమందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.