గుండెల్ని పిండేసే సంఘటన- బిడ్డ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని విలపించిన తల్లిదండ్రులు - family with son dead body - FAMILY WITH SON DEAD BODY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 8:22 PM IST
Family With Son Dead Body: అల్లూరి జిల్లాలో గుండెల్ని పిండేసే సంఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ బాలుడిని తల్లిదండ్రులు బస్సులో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో కన్నుమూసిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. బస్సులో నుంచి ఆ బాలుడి మృతదేహాన్ని దించేయడంతో తల్లిదండ్రులు రోడ్డుపై కూర్చుని విలపించారు. గూడెం కొత్తవీధి మండలం తీముల బంధకు చెందిన కార్తిక్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో విశాఖలోని కేజీహెచ్‌లో చేర్పించారు. కార్తిక్ పరీక్షించిన వైద్యులు 3 నెలల క్రితం కుక్క కరిచిందని గుర్తించారు. కనీసం వ్యాక్సిన్ వేయించుకోలేదని నిర్ధారించారు. అప్పటికే కార్తిక్ ఆరోగ్యం క్షీణించింది.
దీంతో బాలుడుని ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. విశాఖలో అరకులోయకు వెళ్లే బస్సు ఎక్కారు. అరకులోయ రాకముందే, మార్గమధ్యలో కార్తిక్ తుదిశ్వాస విడిచారు. ప్రాణంలేని బిడ్డతో విలపిస్తూ తల్లిదండ్రులు బస్సు దిగారు. బాలుడి మృతదేహాన్ని గుడ్డలో చుట్టి, తల్లిదండ్రుల ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన కూర్చునారు. ఈ సంఘటన చూసి స్థానికులు చలించిపోయారు. అరకు ఎంపీ తనూజారాణికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎంపీ ఆరకులోయ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. స్థానికులు సైతం కొంత డబ్బు పోగిచేసి బాధితులకు అందించారు.