How to do Navagraha Pradakshina : చాలా మందికి గుడికి వెళ్లగానే ముందుగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలా? లేదా దేవుడిని దర్శించుకోవాలా ? నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ? ప్రదక్షిణల తర్వాత కాళ్లు కడుక్కోవచ్చా? ఇలా అనేక సందేహాలు మదిలో మెదులుతుంటాయి. అయితే, ఈ ప్రశ్నలకు ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు మీ కోసం.
లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని తెలిపే సంకేతాలివే - కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుందంటే!
నవగ్రహాల విషయంలో కొన్ని పొరపాట్లు :
సహజంగానే కొందరు ఆలయానికి వెళ్లినప్పుడు తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా చెప్పులు విడిచి పెట్టడానికి స్టాండ్ వంటివి లేకపోతే ధ్వజస్తంభం, రావి చెట్టు, చిన్నచిన్న విగ్రహాల దగ్గర చెప్పులు విడిచి పెడుతుంటారు. అలా ఎప్పుడూ చెప్పులు విడిచిపెట్టకూడదు. చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేకపోతే, కాళ్లు కడుక్కునే చోట చెప్పులు విడిచి ఆలయం లోపలికి వెళ్లాలి.
చాలా మందికి ఆలయంలోకి ప్రవేశించగానే దేవుడిని దర్శించుకోవాలా? లేదా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా? అని సందేహం కలుగుతుంది. అయితే, ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్లగానే పరివారంలో ఉన్న దేవతలను దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రధాన దేవుడిని దర్శించుకోవాలి. అంటే ఆలయానికి వెళ్లగానే నవగ్రహాలను దర్శనం చేసుకోండి. ఆపై ప్రదక్షిణలు చేయాలి. అనంతరం పరమేశ్వరుడిని దర్శించుకోవాలి. అంతేగానీ, ముందుగా ప్రధాన దేవుడిని దర్శించి, ఎట్టి పరిస్థితుల్లోనూ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయకూడదు.
నవగ్రహాల ప్రదక్షిణ ఇలా చేయాలి :
ముందుగా కాళ్లు కడుక్కున్న తర్వాత తూర్పువైపు తిరిగి సూర్యుడికి నమస్కరించాలి. అనంతరం మీ వీలును బట్టి నవగ్రహాలకు 3, 9, 11, 21, 54 లేదా 108 ప్రదక్షిణలు చేయవచ్చు. నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే నవగ్రహాల అనుగ్రహం విశేషంగా కలుగుతుంది.
నియమం లేదు!
చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి తర్వాత కాళ్లు కడుక్కుంటారు. అలాగే కళ్లను నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కానీ, మంత్ర శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్లు కడుక్కోవాలనే నియమం లేదు. ఇలా కాళ్లు కడుక్కోవడం వల్ల నవగ్రహాల అనుగ్రహం కూడా తగ్గిపోయే అవకాశం ఉందట! కాబట్టి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి తర్వాత కాళ్లు కడుక్కోకండి. కొంతమంది శివాభిషేకం చేసిన తర్వాత స్నానం చేస్తుంటారు. ఇలా చేయకూడదు.
సవ్య దిశలోనే :
కొంతమంది నవగ్రహాలలో రాహువు, కేతువు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారని రెండు ప్రదక్షిణలు అపసవ్య దిశలో (anticlockwise), మిగిలిన 7 ప్రదక్షిణలు సవ్య దిశలో (clockwise) తిరుగుతూ ఉంటారు. కానీ ఇలా ప్రదక్షిణలు చేయకూడదు. నవగ్రహాలకు ఎప్పుడైనా ప్రదక్షిణలను సవ్య (clockwise) దిశలోనే చేయాలి.
నవగ్రహాలను తాకవచ్చా ?
నవగ్రహాలను మామూలు సమయంలో తాకకూడదు. నవగ్రహాలలో శనిగ్రహానికి తైలాభిషేకం చేస్తున్నప్పుడే తైలం పోయాలి. మిగిలిన సమయాల్లో నవగ్రహాల దగ్గర దీపం మాత్రమే పెట్టాలి. అయితే, నవగ్రహాలలో శనిగ్రహానికి తైలాభిషేకం చేసిన తర్వాత అర్చకుడు కాళ్లు కడుక్కోమని చెబితే కడుక్కోవాలి. మామూలుగా అయితే, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్లు కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఆలయానికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఆ స్వామి విగ్రహం నిలువెల్లా విషం - తొడ భాగంలో విభూతి పంపిణీ
రాత్రిళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? - వాటి అరుపుల వెనుక కారణాలేంటో తెలుసా?