రాయచోటిలో పిచ్చికుక్క స్వైర విహారం- 30 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం - Dog Attack on Many People - DOG ATTACK ON MANY PEOPLE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 4:04 PM IST
Dog Attacked Many People in Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న వారిపై దాడి చేసింది. కుక్క దాడిలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి ఒకసారిగా 30 మంది కుక్కకాటు బాధితులు రావడంతో ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే వారికి చికిత్స చేసి కుక్క కాటు మందు ఇంజక్షన్లు వేశారు. నడుచుకుంటూ వెళుతున్న వారిని కాకుండా ద్విచక్ర వాహనదారులు, ఆటోలో వెళుతున్న వారిని కూడా కుక్క కరిచింది.
గాయపడిన వారిలో నలుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారిలో అహమదుల్లా అనే బాలునికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని పట్టణవాసులు వాపోతున్నారు. గతంలో ఇలాంటివి జరిగినా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఇకనైనా చర్యలు తీసుకుని కుక్కలను నియంత్రించాలని కోరారు.