Vanjaram Fish Curry Recipe in Telugu : చేపల వంటకాలు అనగానే ఎంతో మందికి నోరూరుతుంది. పులుసైనా, ఫ్రై చేసినా సరే ముద్ద మిగలదు, ముక్క వదలరు. తెలంగాణ స్టైల్లో నిప్పులపై ఉల్లిగడ్డలు కాల్చి చేసినా, నెల్లూరు స్టైల్లో బెండకాయ ముక్కలు కలిపి వండినా ఆ రుచే వేరు. కొద్దిగా ఉల్లిపాయల తరుగు, చింతపండు రసం, జీలకర్ర, మెంతుల పొడి కలిపి చేసే చేపల పులుసు ఎవరికి నచ్చదు చెప్పండి?! సీ ఫుడ్ లవర్స్ చేపల వంటకాల కోసమే టూర్లు పెట్టుకుంటారంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.
ఇక ఇవాళ మనం చెప్పుకొనే వంటకం వంజరం చేప ఇగురు. వంజరం అంటే సముద్ర చేప. వంజరం (Indo-Pacific king mackerel) చేప హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది సుమారు 45 కిలోల వరకు పెరుగుతుంది. కొర్రమేన్ మాదిరిగానే ఒకటేపొడవైన వెన్ను ముల్లు (Single bone Fish) తప్ప అంతా కండ ఉంటుంది. ఇండియా, బంగ్లాదేశం, శ్రీలంకలో దీనికి డిమాండ్, ధర కూడా ఎక్కువ.
ఎన్ని వెరైటీలున్నా కరివేపాకు చికెన్ క్రేజ్ వేరే! - సింపుల్ టిప్స్‌తో సూపర్ టేస్ట్
తయారీకి కావాల్సిన పదార్థాలు :
- వంజరం చేప ముక్కలు - కిలో
- పసుపు - 1 టీ స్పూన్
- ఉప్పు - ఒకటిన్నర టీ స్పూన్లు
- కారం - 3 టీస్పూన్లు
కూర చేయడానికి కావలసిన పదార్థాలు:
- నువ్వుల నూనె - 4 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- మెంతులు - 1/2 టీస్పూన్
- చిన్న ఉల్లిపాయలు - 15
- ఉల్లిపాయల తరుగు - మీడియం సైజువి 3
- వెల్లుల్లి రెబ్బలు - 15
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకులు - 2 రెమ్మలు
- అల్లం వెల్లుల్లి పేస్టు - 3 టీస్పూన్లు
- టొమాటోలు - 4
- కల్లుప్పు - 1 టీస్పూన్
- కారం - 3 టీస్పూన్లు
- ధనియాల పొడి - 3 టీస్పూన్లు
- చింతపండు రసం - 1 కప్పు
- నీళ్ళు - 2 కప్పులు
- కొత్తిమీర
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
తయారీ విధానం :
- శుభ్రం చేసుకున్న వంజరం చేప ముక్కలను ముందుగా మారినేట్ చేసుకోవాలి. వాటికి పసుపు, ఉప్పు, కారం బాగా పట్టించేలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వెడల్పాటి కడాయి తీసుకుని పొయ్యి వెలిగించాలి. (ఫిష్ కర్రీ కోసం వెడల్పాటి పాత్రలు వాడడం మంచిది).
- కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె పోసుకోవాలి. ఈ నూనె మంచి ప్లేవర్ ఇస్తుంది. దీనికి బదులుగా కొబ్బరి లేదా పల్లీ నూనె కూడా వాడుకోవచ్చు.
- నూనె వేడికాగానే ఒక టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ మెంతులు వేసుకోవాలి. అవి చిటపటలాడుతున్న సమయంలోనే మూడు మీడియం సైజు ఉల్లిపాయల తరుగు వేసుకుని కలపాలి. వాటికి తోడుగా కట్ చేయని చిన్న ఉల్లిపాయలు 15, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే చేపల కూర రుచి బాగుంటుంది.
- ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు అంటే పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. పది నిమిషాల తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకులు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, నాలుగు పండు టమోటాల తరుగు వేసుకోవాలి. ఫిష్ ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్లుగా టమోటా తరుగు వేసుకోవాలని గుర్తుంచుకోవాలి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఈ సమయంలో వచ్చే వాసన అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రేవీ బాగుంటేనే కూర బాగుంటుంది. మసాలా వేగాక కప్పు చింతపండు రసం కలుపుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి.
- నీళ్లు బాగా మరిగి పచ్చి వాసన పోయాక ఫిష్ ముక్కలు వేసుకోవాలి. అందుకోసం ఐదు నిమిషాలు మరిగించాలి. గరిటె పెట్టకుండా(ముక్క చెదరకుండా) కడాయిని చేతుల్లోకి తీసుకుని తిప్పుకోవాలి. ఆ తర్వాత పది నిమిషాలు ఉడికిస్తే సరి. నూనె పైకి తేలి ఘుమఘమ వాసనకు తోడు కూర చూడ ముచ్చటగా ఉంటుంది.
- చివరగా కొంచెం కొత్తి మీర చల్లుకుని అన్నంలో తింటుంటే ఆ రుచే వేరు. ఇంకెందుకు ఆలస్యం ఓ సారి ఇదే పద్ధతిలో, ఇవే కొలతలతో వంజరం పులుసు పెట్టండి.
నాటు కోడి పులుసు ఇలా చేయండి - ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!
మాంసాహారం మంచిదా? చెడ్డదా? - వారంలో ఎన్నిసార్లు నాన్ వెజ్ తినొచ్చో తెలుసా?