ఇస్రో శాస్త్రవేత్తలే నిజమైన హీరోలు: పవన్ కల్యాణ్ - Pawan Kalyan in Sriharikota
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 13, 2024, 7:41 PM IST
Deputy CM Pawan Kalyan Participate in National Space Day : రాకెట్ ప్రయోగాలకు తలమానికమైన శ్రీహరికోటలోని ఇస్రో శాస్త్రవేత్తలే నిజమైన హీరోలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాస్త్రవేత్తలను యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రయాన్ ప్రయోగాల విజయ పరంపర కొనసాగించాలన్నారు. తిరుపతి జిల్లా శ్రీ హరికోటలో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. శ్రీ హరికోటలోని పలు ప్రయోగశాలలను ఆయన సందర్శించారు.
రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలను దేవుళ్లుగా పవన్ అభివర్ణించారు. రాకెట్ ప్రయోగాలు బాలీవుడ్ సినిమాలకు అయ్యే ఖర్చు కన్నా తక్కువేనని అన్నారు. శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా ఉండటంతో ప్రయోగాలు విజయవంతం అవుతున్నాయన్నారు. శ్రీ హరికోట సందర్శనతో తన చిన్ననాటి కల నెరవేరిందన్నారు. ముందుగా షార్ పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు ఘనస్వాగతం లభించింది. జిల్లా అధికారులు, పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్లో శ్రీహరికోట చేరుకుని సందర్శించారు.