Minister Anitha Fires on YSRCP : ఐదో రోజు శాసనమండలిలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలపై ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి అనిత సమాధానం ఇచ్చారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని అనిత విమర్శించారు. వైఎస్సార్సీపీ పాలనలో పరామర్శకు వెళ్లిన తమపైనే కేసులు పెట్టారని అనిత విమర్శించారు.
దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారని అసలు ఆ చట్టం ఉందా అని ప్రశ్నించారు. దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయని? అన్నారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టిందని వివరించారు. పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదని వైఎస్సార్సీపీ హయాం నాటిదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుంటున్నామని అనిత వెల్లడించారు.
'గత ఐదు సంవత్సరాల్లో పోలీసులు పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి, రోడ్ల మీద కాపలా కాయడానికి పని చేశారు. ఒక్క మహిళనైనా వారు రక్షించారా? దిశ చట్టానికి చట్టబద్ధత లేకుండా దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించారు. అదే రోజు దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసి పోలీస్‌స్టేషన్ ముందు వదిలేసి వెళ్లారు. దిశ యాప్‌తో నేరాలు తగ్గింది నిజమైతే రికార్డుల్లో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయి. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ కట్టడానికి వైఎస్సార్సీపీ పాలనలో కేంద్రం నిధులు మంజూరు చేసింది. అది పూర్తయి ఉంటే నేరాలు జరిగిన వెంటనే శిక్షలు పడేందుకు అవకాశం ఉండేది.' -అనిత, హోంమంత్రి
మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట : 2014 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 83,202 కేసులు నమోదయ్యాయని అనిత వివరించారు. 2019-24 మధ్య 1,00,508 కేసులు నమోదైనట్లు చెప్పారు. గడిచిన ఐదేళ్లలో మహిళలపై అఘాయిత్యాలు 20.8 శాతం పెరిగాయని పేర్కొన్నారు. గత సర్కార్ దిశ చట్టాన్ని తెచ్చి అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జగన్ హయాంలో అనేక అఘాయిత్యాలు జరిగినా కనీస చర్యల్లేవని మండిపడ్డారు. మహిళా పోలీస్స్టేషన్ల బోర్డులను దిశ పీఎస్‌లుగా మార్చారని దుయ్యబట్టారు. గంజాయి నియంత్రణపై జగన్ ఒక్కసారి కూడా సమీక్షించలేదని అనిత ఆక్షేపించారు.
'మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రత్యేక కోర్టులతో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తున్నాం. జగన్ తల్లి, చెల్లికి అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళల జోలికొచ్చినా, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళా పోలీస్స్టేషన్లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. ఐదు నెలల కాలంలో 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని రిమాండ్‌కు పంపించాం. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కఠిన చట్టాలు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం’ అని అనిత వెల్లడించారు.
అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్సార్సీపీ సభ్యులు ఆరోపించారు. అనంతరం మండలి నుంచి వారు వాకౌట్ చేశారు.
జగన్ అసెంబ్లీకి రారని పందేలు నడుస్తున్నాయి - 10మంది ఎమ్మెల్యేలూ సహకరించట్లేదు : అనిత
వాళ్లు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరం - ఎక్కడ దాక్కున్నా వదలం : హోంమంత్రి అనిత