160 మొసలి పిల్లలను నదిలో వదిలిన అధికారులు- ఎందుకో తెలుసా? - Crocodiles Released In River - CROCODILES RELEASED IN RIVER
Published : Jun 18, 2024, 8:02 PM IST
Crocodiles Released In River : ప్రపంచ మొసళ్ల దినోత్సవం సందర్భంగా 160 మొసలి పిల్లలను బిహార్ బహాగా జిల్లాలోని గండక్ నదిలో వదిలారు అటవీ శాఖ అధికారులు. గండక్ నది ఒడ్డున 6 ప్రదేశాల్లో గత 3 నెలలుగా వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అటవీ శాఖ, శిక్షణ పొందిన స్థానికులు మొసళ్ల గుడ్లను సంరక్షిస్తున్నారు. ఇటీవల మొసలి గుడ్లు పొదగడం వల్ల వాటి పిల్లలను గండక్ నదిలో విడిచిపెట్టారు.
లాస్ ఏంజిల్స్ జూ, కాలిఫోర్నియా జూ కూడా ఈ మొసలి గుడ్ల సంరక్షణ, పెంపకంలో భాగమయ్యాయి. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అటవీ, పర్యావరణ శాఖ మొసళ్ల సంరక్షణలో కీలక పాత్ర పోషించాయి.
'2013 నుంచి గండక్ నదిలో క్రోకోడైల్ రికవరీ ప్రాజెక్ట్ కింద మొసళ్ల సంరక్షణ చేపడుతున్నాం. గుడ్లను సంరక్షించడం, వాటి పెంపకం ప్రక్రియ మార్చి నెల నుంచి ప్రారంభమవుతుంది. ఒక ఆడ మొసలి నదికి సమీపంలో ఎత్తైన ఇసుక దిబ్బపై గూడు కట్టి గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత 2-3 నెలల్లో గుడ్డు నుంచి మొసలి పిల్లలు బయటకు వస్తాయి. గండక్ నది వాతావరణం మొసళ్లకు ఆహ్లాదకరంగా ఉంటుంది.' అని వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా హెడ్ సుబ్రతా బహెరా తెలిపారు.