వైఎస్సార్సీపీకి ఓటమి తప్పదు - బీజేపీతో పొత్తు ఏ పార్టీకి తగదు: గఫూర్ - రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 2:56 PM IST
CPM Leader Ghafoor Comments on State Politics : ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని తెలుస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ అన్నారు. ఒకప్పుడు 175 స్థానాలు తమకే వస్తాయని మాట్లాడిన వైఎస్సార్సీపీ ఇప్పుడు గెలుపొందితే చాలని చూస్తున్నారని ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ప్రభావం పడిందని కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే గెలవడం కష్టమని ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించాలని సూచించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ధీమాతో ఉన్నారని కానీ కాస్త అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేయాలని, భాజపాతో సన్నిహితంగా ఉంటూ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఎవరూ ఓట్లు వేయరనే విషయాన్ని గుర్తించుకోవాలని గఫూర్ పేర్కొన్నారు.