మోదీ దత్తపుత్రులు సంపద దోచుకుని దేశం వదిలి పారిపోయారు : సీపీఐ నారాయణ - CPI Narayana Fires On KCR - CPI NARAYANA FIRES ON KCR
Published : May 2, 2024, 7:58 PM IST
CPI Narayana Fires On Modi : ప్రధాని నరేంద్ర మోదీ దత్తపుత్రులు 29 మంది దేశానికి చెందిన రూ.14 లక్షల కోట్ల సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్‌లో పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఒక్క విజయ్ మాల్యా తప్ప అందరూ గుజరాత్‌కు చెందిన దొంగలే అన్నారు. దేశ సంపదను వారికి దోచిపెట్టింది నరేంద్ర మోదీ అన్నారు. ఈ లెక్కన చూస్తే దేశంలో అత్యంత అవినీతిపరుడు మోదీనే అన్నారు.
తన మిత్రులైన కార్పొరేట్ శక్తులకు జీఎస్టీ పన్ను తగ్గించి, పేదలు, ప్రతి సామాన్యుడు వేసుకునే పాదరక్షలపై మాత్రం 5 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ విధించిన మోదీ ఎవరికి ప్రధాని అని ప్రశ్నించారు. అవినీతి ఆహంకారం వల్లనే కేసీఆర్ ఓడిపోయారని స్పష్టం చేశారు. ఇప్పుడు కేసీఆర్ అన్నీ అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఓటుతో బీజేపీ, బీఆర్ఎస్లను దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న హిందువులు, ముస్లింలను వేరు చేసే మత రాజకీయాలను ఖమ్మం జిల్లా ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.