'వచ్చే విద్యా సంవత్సరానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ' - CM REVANTH ON SPORTS UNIVERSITY - CM REVANTH ON SPORTS UNIVERSITY
Published : Aug 25, 2024, 2:00 PM IST
Young India Sports University Start from Next Academic Year : రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామని అన్నారు. దానికి అనుగుణంగా క్రీడాకారుల నైపుణ్యాలను పెంచి ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మారథాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం హాజరై టీ షర్ట్‌ను ఆవిష్కరించారు. పరుగులో పాల్గొని ముందు స్థానంలో నిలిచిన వారికి బహుమతిగా నగదును అందజేశారు. ఒలింపిక్స్ క్రీడలకు సైతం రాష్ట్రాన్ని అనుగుణంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.
ఏటా ఆరోగ్యంపై అవగాహన కోసం నిర్వహించే మారథాన్ హైదరాబాద్‌లో ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్ఎండీసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మారథాన్ జరిగింది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన పరుగు గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు సాగింది. ఈ పరుగు మారథాన్‌లో వివిధ దేశాల నుంచి 52 మంది రన్నర్లతో పాటు ఫుల్, ఆఫ్ మారథాన్‌లో 25500 మంది రన్నర్స్ పాల్గొన్నారు. ఈ మారథాన్‌ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.