తెలంగాణలో టీడీపీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తాం : చంద్రబాబు - CBN MEET TELANGANA TDP LEADERS - CBN MEET TELANGANA TDP LEADERS
Published : Aug 25, 2024, 9:04 PM IST
CM Chandrababu meet Telangana TDP Leaders : తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో కృషి చేయనున్నట్టు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేసినట్టు ప్రకటించిన ఆయన, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు.
దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదుపై ప్రధానంగా చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు, ఆన్‌లైన్‌లో సభ్యత్వం తీసుకొనే ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలో యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. 15 రోజులకు ఒకసారి తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. నటుడు బాబుమోహన్ సైతం పార్టీ ఆఫీస్‌లో చంద్రబాబును కలిశారు. అనంతరం చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను కలిశారు. ఏపీలో ఘన విజయం దక్కడం వెనక కార్యకర్తల కృషి ఎంతగానో ఉందని ఆయన పేర్కొన్నారు.