మాజీ ఎంపీ నందిగం సురేష్ నుంచి ప్రాణహాని ఉంది - పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజధాని రైతు - Capital farmer complaint to police - CAPITAL FARMER COMPLAINT TO POLICE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 4:16 PM IST
Capital Farmer Complaint From former MP Nandigam Suresh : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాజధాని రైతు పులిచిన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న(శనివారం) రాత్రి నందిగం సురేష్ మనుషులు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా రాజధాని కోసం పోరాటం చేశామని తెలిపారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన గెలుపుకోసం పనిచేశానని వెల్లడించారు. అనుకున్న విధంగానే కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో గెలిచిందని, ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాని కలిసి శుభాకాంక్షలు తెలిపానని వెల్లడించారు.
దీనిని జీర్ణించుకోలేని నందిగం సురేశ్ దాడి చేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. ఇందులో భాగంగానే నిన్న రాత్రి విజయవాడ నుంచి ఇంటికి వచ్చే సమయంలో దాదాపు 100 మంది అనుచరులతో తన ఇంటిపై దాడిచేశారని తెలిపారు. ఈ దాడి గురించి ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పోలీసు వ్యవస్థ ఇంకా మారలేదని విమర్శించారు. ఇప్పటికైన పోలీసులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని పులి చిన్నా డిమాండ్ చేశారు.