Minister Nimmala Presentation at Udaipur Conference in Rajasthan : జాతీయ జలభద్రతలో పోలవరం ప్రాజెక్టు కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు అత్యంత విశిష్టమైనదిగా పేర్కొన్నారు. 50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జి సామర్థ్యంతో 1128 మీటర్ల పొడవైన స్పిల్ వే నిర్మించినట్టు స్పష్టం చేసారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరులశాఖ మంత్రుల సదస్సుకు నిమ్మల హాజరై ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డెల్టాల స్థిరీకరణకు, సుస్థిర సాగుకు పోలవరం అత్యంత కీలకమని చెప్పారు.
జాతీయ జల భద్రత అంశంపై ఉదయపూర్లో అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికసిత భారత్- 2047లో భాగంగా జల సంరక్షణ అంశాలపై రాష్ట్రాల జలవనరులశాఖ మంత్రుల సమావేశంలో చర్చించారు. ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న జల సంరక్షణ చర్యలపై మంత్రులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ నుంచి హాజరై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు.
దేశంలోనే తొలిసారిగా : కృష్ణ గోదావరి డెల్టాల స్థిరీకరణ సుస్థిర వ్యవసాయానికి పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మరొక 85 సాగునీటి ప్రాజెక్టులు తాగు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం నిర్మితమవుతున్నట్టు వెల్లడించారు. జలవనురులను వినియోగించడంలో సాంకేతికతను వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. భూగర్భ జలాల్ని కొలిచేందుకు 1810 ఫిజియో మీటర్లు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేసారు. దేశంలోనే తొలిసారిగా బోర్ వెల్స్ని కూడా జియో ట్యాగ్ చేసి వినియోగిస్తున్నట్టు మంత్రి వ్యాఖ్యానించారు. జల సంరక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల ఎకరాల్లో డ్రిప్ స్ప్రింగ్లర్ల ద్వారా వ్యవసాయం జరుగుతోందన్నారు.
కేంద్ర సహకారం అవసరం : వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా రియల్ టైంలో ప్రాజెక్టులు భూగర్భ జలాలు, కాలువలకు నీటి విడుదల తదితర అంశాల్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఎక్కడ నీటి వృథా లేకుండా సాంకేతికతను వినియోగించి జలవనరులను సమర్థంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. వికసిత భారత్ విజన్ లో భాగంగా కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా జల సంరక్షణ ప్రణాళికల్ని వివరించారు. ఏపీలో ఉన్న ఐదు ప్రధాన నదులు, 35 మైనర్ నదులు నుంచి జలాలని గరిష్టంగా వినియోగించి రాయలసీమ లాంటి కరవు ప్రాంతాలకు నీటిని తరలించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర నుంచి సహకారం అవసరమని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు.
ప్రతి ఏకరాకు నీరందిస్తాం - సిరులపంటలు పండిస్తాం: మంత్రి రామానాయుడు
2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల - సీఎం ఏమన్నారంటే!