నిలిచిపోయిన ట్రైడెంట్ చక్కెర కర్మాగారం వేలం ప్రక్రియ
Published : Feb 28, 2024, 5:47 PM IST
Canceled Trident Sugar Factory Auction Process : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) ట్రైడెంట్ చక్కర కర్మాగారం వేలం ప్రక్రియ నిలిచిపోయింది. కర్మాగారం కొనుగోలుకు బిడ్లు దాఖలు కాకపోవడం సహా 9.50 కోట్ల బకాయిల్లో 5.40 కోట్లు చెరుకు బిల్లులను బుధవారం రాత్రి రైతుల ఖాతాల్లో యాజమాన్యం జమ చేయడంతో వేలం ప్రక్రియకు అడ్డుగా మారింది. గత రెండేళ్లుగా చక్కెర కర్మాగారం యాజమాన్యం చెరుకు బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యంపై మండిపడుతూ ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి బుధవారం చక్కర కర్మాగారం వేలం పాటకు నిర్ణయించారు. ప్రభుత్వ చర్యలతో ట్రైడెంట్ యాజమాన్యం దిగి రావడం పట్ల రైతులు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజాం చెక్కర కర్మాగారాలను మళ్లీ తెరిపిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ చక్కర కర్మాగారాన్ని మళ్లీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు.
ట్రైడెంట్ చక్కర కర్మాగారం : గత ప్రభుత్వాలు స్థిరాస్తి వ్యాపారం మాదిరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటుకు అమ్మేశారని ఆరోపించారు. రైతు ప్రభుత్వంగా ఉండే కాంగ్రెస్ సర్కారు కేవలం 100 కోట్లు వెచ్చిస్తే జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులకు సమస్యలు పూర్తిగా తీరిపోతాయని వేడుకుంటున్నారు. రైతులకు ఇంకా బకాయిగా ఉన్న రెండున్నర కోట్లతో పాటు కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేలం కోసం బిడ్లు రాకపోవడంతో ప్రక్రియ నిర్వహించేందుకు వచ్చిన చక్కెర రెవెన్యూ శాఖ అధికారులు మధ్యాహ్నం వరకు వేచి చూసి వెళ్లిపోయారు.