హరీశ్‌రావు మాటలను పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నారు : దేవీప్రసాద్ - BRS Explanation Harish Rao Comments - BRS EXPLANATION HARISH RAO COMMENTS
Published : Sep 7, 2024, 3:54 PM IST
BRS Leader Devi Prasad On Harish Rao Comments : శాంతి భద్రతలకు సంబంధించి మాజీ మంత్రి హరీశ్‌రావు చేసన వ్యాఖ్యలను పోలీస్ అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం కుప్పకూల్చిందని హరీశ్‌రావు అన్నారని పేర్కొన్నారు. పోలీసులు, పోలీసు అధికారుల పట్ల తమకు గౌరవం ఉందని, హరీశ్‌రావు నిరంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల మాట్లాడుతున్నారని దేవీ ప్రసాద్ వివరించారు. ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో నలుగురు మాజీ మంత్రులు పర్యటన చేస్తే దాడులు జరిగాయని, కనీసం పోలీసులు స్పందించలేదని తెలిపారు. పోలీసు అధికారులు కొంతమంది ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని హరీశ్‌రావు అన్నారని దేవీ ప్రసాద్ తెలిపారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకటి, రెండు మినహా ఎన్కౌంటర్లు జరగలేదని, కాంగ్రెస్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్కౌంటర్లు ప్రారంభం అయ్యాయని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టీచర్స్ అవార్డ్స్‌లో పారదర్శకత లేదన్న మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ప్రతి జిల్లా నుంచి నలుగురు టీచర్లను ఎంపిక చేయాలని తెలిపారు. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదర్శ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలుగా మార్చాలని కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వం ప్రయోజనాలు కల్పించడం లేదని సుధాకర్ రెడ్డి ఆరోపించారు.