ప్రభుత్వం మిడ్ డే మీల్ కార్మికులపై దృష్టి సారించకపోవడం బాధాకరం : ఈటల - etela rajender slams congress
Published : Aug 25, 2024, 10:40 PM IST
Etela Rajender Slams Congress : కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి నేడు నిట్టనిలువునా ముంచిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వ వ్యవహారం ఒడ్డెక్కే దాకా ఓడ మల్లప్ప, ఒడ్డెక్కిన తర్వాత బోడ మల్లప్ప అన్న చందంగా ఉందని విమర్శంచారు. హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంటశాల కార్మికుల ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించారు.
ప్రభుత్వం వంటశాల కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈటల సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై చర్చించకపోవడం విచారకరమని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. వంటశాల కార్మికుల కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం రాష్ట్రప్రభుత్వం వాడుకోవడం దారుణమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.