కేసీఆర్‌కు పదవి ఎందుకు, బార్ పెట్టుకుంటే చాలదా - కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్ - కేటీఆర్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్
Published : Jan 28, 2024, 11:01 PM IST
BJP MP Bandi Sanjay Fire on KTR : హిందూమతం గురించి మాట్లాడే బండి సంజయ్‌కి రాజకీయాలెందుకని, మఠం పెట్టుకుంటే చాలు అంటూ ఇటీవల ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ బదులిస్తూ, కేటీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లా ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను ఆదివారం సంజయ్ పరిశీలించారు. రైల్వే అధికారులతో మాట్లాడి, నిర్మాణ పనుల్లో జాప్యానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. జులై నెలలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.
కేసీఆర్‌కు సీఎం పదవెందుకని, బారు పెట్టుకుంటే చాలదా అని ఎద్దేవా చేశారు. నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే కేటీఆర్‌కు రాజకీయాలెందుకు మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా అని సంజయ్ విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా కేటీర్‌కు అహంకారం తగ్గలేదన్నారు. తాగి నడిపితే కారు సర్వీసింగ్ రాకపోతే ఏమవుతుందని ఎద్దేవా చేశారు. కారు సర్వీసింగ్‌కు పోలేదని, స్క్రాప్‌కు వెళ్లిందని విమర్శించారు. అక్కడ కూడా ఎవరూ ఆ కారును కొనటం లేదని దుయ్యబట్టారు. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసే వినోద్‌కుమార్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పెద్ద నాస్తికులని ధ్వజమెత్తారు. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికే యాదగిరిగుట్టను అభివృద్ధి చేశామని చెప్పిన మూర్ఖుడు కేటీఆర్ అని మండిపడ్డారు.