ఎన్నికల వచ్చినప్పుడల్లా జగన్ పైనే దాడులు జరుగుతున్నాయి: బీజేపీ - BJP Leader Lanka Dinakar Reaction - BJP LEADER LANKA DINAKAR REACTION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 3:03 PM IST
Stone Attack On CM YS Jagan: ముఖ్యమంత్రి జగన్పై దాడిని ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి కనీసం భద్రత ఇవ్వలేని రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి అసమర్థత బట్టబయలు అయ్యిందని మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి సమర్థతపై అనుమానాలున్నాయి కాబట్టే ఏపీ బీజేపీ వారిని విధుల నుండి తొలగించాలని ఎన్నికల కమిషన్ను కోరిందన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుల భద్రతా దృష్ట్యా తక్షణం రాష్ట్రానికి సమర్థులైన డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి నియామకం అవసరమని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా జగన్ పైనే దాడులు జరుగుతున్నాయని రాష్ట్రంలో రాజకీయ పండితులు విస్మయం వ్యక్తపరుస్తున్నారన్నారు. బెంగాల్లో మమతా, ఆంధ్రాలో జగన్ పైన ఎన్నికల సమయంలో దాడులు విషయంలో దేశంలో రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారని లంకా గుర్తు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ అంశాలు బహిర్గత పరచడానికి ముందే అధికారి పార్టీ నాయకులు దురుద్దేశాలు చంద్రబాబుకు ఆపాదించడాన్ని ఖండిస్తున్నామన్నారు. 2019 లో కోడి కత్తి, బాబాయి గొడ్డలితో ప్రజలను మభ్య పెట్టినట్టే, 2024 లో మరో అంకానికి ప్రయత్నం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ భారీ ఓటమి దిశగా పయనిస్తుందని తెలిసి అభూతకల్పనలకు బీజం వేస్తుందని లంకా దినకర్ అన్నారు.