ప్రారంభానికి ముందే కుప్పకూలిన వంతెన- కోట్ల రూపాయల వృథా- వీడియో వైరల్ - Bihar Bridge Collapse - BIHAR BRIDGE COLLAPSE
Published : Jun 19, 2024, 8:03 AM IST
|Updated : Jun 19, 2024, 12:27 PM IST
Bihar Bridge Collapse : బిహార్‌లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. అరారియా జిల్లాలోని బక్రా నదిపై కుస్రా కాంతా-కిస్రీ ప్రాంతాలను కలుపుతూ ఓ వంతెనను నిర్మించారు. అయితే, ఈ వంతెన మంగళవారం అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూలిపోయింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు వంతెనలో మూడు పిల్లర్లు కూలిపోయినట్లు గుర్తించారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వంతెన దగ్గరకు వచ్చిన స్థానికుల్లో కొందరు ఆ దృశ్యాల్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
జిల్లా గ్రామీణ పనుల విభాగం ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం దాదాపు రూ.12కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా వేశారు. బ్రిడ్జి పూర్తైనప్పటికీ ఇరువైపుల అప్రోచ్ రోడ్డు పనులు మిగిలి ఉండటం వల్ల ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. వంతెన నిర్మాణంలో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.