దొంగ ఓట్లతో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది: భానుప్రకాశ్‌రెడ్డి - నకిలి ఓట్లపై భాను ప్రకాష్ ఫైర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 6:53 PM IST
Bhanu Prakash Reddy Fires on Fake votes: దొంగ ఓట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. అధికారులు, పోలీసులు కుమ్మక్కై అధికార పార్టీ అక్రమాలకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఇప్పటి వరకు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. విచారణను వాయిదా వేసుకుంటూపోతే న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు. 15 రోజుల్లో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం అభివృద్ధి లేని ఏపీలో మనం ఉన్నామని భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు.
అరాచక, అవినీతి, అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన ధ్వజమెత్తారు. కక్ష సాధింపు చర్యలే పనిగా పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తుందని భానుప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా రామమయమైతే, ఇక్కడ మాత్రం దొంగలమయమైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై కాదు సర్వే మీపై చేసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. దొంగ ఓట్ల దందాపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామని పేర్కొన్నారు.