LIVE : దిల్లీలో బీటింగ్ రిట్రీట్ వేడుకలు 2024 - ప్రత్యక్షప్రసారం - beating retreat celebrations 2024
Published : Jan 29, 2024, 5:14 PM IST
|Updated : Jan 29, 2024, 6:44 PM IST
గణతంత్ర దినోత్సవ వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. ఈనెల 26న అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలకు ఇవాల్టి కార్యక్రమంలో ముగింపు పలకనున్నారు. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో త్రివిధ దళాలు బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ దేశాల రాయబారులు, సామాన్య పౌరులు హాజరయ్యారు. వేడుక కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ గుర్రపు బగ్గీలో వచ్చారు. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో త్రివిధ దళాలకు చెందిన వాయిద్యకారులు కవాతు నిర్వహిస్తారు. జాతీయ సమైక్యత, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని నింపే పాటలను తమ వాయిద్యాల ద్వారా వినిపిస్తారు. ఈ వేడుకతో రిపబ్లిక్ డే ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమం కోసం త్రివిధ దళాలకు చెందిన పలు విభాగాలలో ఉన్న వాయిద్యకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. రాష్ట్రపతి సమక్షంలో జరిగే ఈ వేడుక ఏటా సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.