రెచ్చిపోయిన దొంగలు- కస్టమర్స్‌లా జువెల్లరీ షాప్‌లోకి చొరబడి యజమానిపై దాడి! - Uttarakhand Dehradun Crime News
Published : Feb 5, 2024, 2:12 PM IST
Attack On Jewellery Shop Owner : ఉత్తరాఖండ్ దెహ్రాదూన్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆభరణాల చోరీ కోసం కస్టమర్స్‌లా నగల దుకాణంలోకి చొరబడి, వెంట తెచ్చుకున్న ఆయుధాలతో యజమానిపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దోపిడీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
వికాస్‌నగర్ కొత్వాలి బజార్ చౌకీ ప్రాంతంలో ఉన్న రాణా జువెల్లర్స్‌లో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ముగ్గురు నిందితులు మొహాలకు ముసుగులు వేసుకొని దుకాణంలోకి ప్రవేశించారు. నగల చోరీకి వచ్చిన వీరిలో ఇద్దరు నిందితులు షాప్ ద్వారం వద్ద నిలబడి ఉండగా, మరో వ్యక్తి కౌంటర్లో కూర్చున్న యజమానితో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వెంట తెచ్చుకున్న పిస్టోల్‌ను తీసి షాప్ ఓనర్‌పై గురిపెట్టాడు. అనంతరం అతడిపై దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన యజమాని ఆ దుండగుడిపై ప్రతిఘటించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న బల్లపైకి ఎక్కి దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ దుకాణం బయటకు లాక్కేళ్లాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని అతడిని పట్టుకున్నారు. వెంటనే వికాస్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడి వద్ద ఉన్న పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
షాప్ యజమాని దాడిని ప్రతిఘటిస్తూ బయటకు వచ్చిన క్రమంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు నిందితులు భయంతో పరారయ్యారు. వీరి కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా అసన్ బ్యారేజీ వద్ద మరో దొంగను పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులపైనే కాల్పులకు దిగాడు నిందితుడు. ఇదే సమయంలో నిందితులిద్దరిలో మూడో దుండగుడు తప్పించుకున్నాడు. ఇతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు దెహ్రాదూన్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.