అన్నారం బ్యారేజీని ఖాళీ చేస్తున్న అధికారులు - 10 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల - అన్నారం బ్యారేజీ సమస్యలు
Published : Feb 18, 2024, 1:57 PM IST
Annaram Barrage Issue : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీలో సీపేజీని అరికట్టేందుకు అవసరమైన పరీక్షల కోసం నీటిని ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రెండు వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. 10 గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులకు పెంచారు. మొత్తం రెండున్నర టీఎంసీల నీటిని దిగువకు వదిలేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత పరిశీలించిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా సమస్య వచ్చే అవకాశం ఉందని, అక్కడ నీటిని ఖాళీ చేసి పరీక్షించాలని సూచించింది.
తర్వాత సీడబ్ల్యూఎస్, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన ముగ్గురు అధికారుల బృందం కూడా అన్నారం బ్యారేజీని పరిశీలించి సూచనలు చేసింది. ఈ మేరకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం నుంచి వదిలిన నీరు మేడిగడ్డకు చేరనుండగా, సుందిళ్లలో వదిలితే అన్నారంలోకి వస్తుంది. గత ఏడాది వరదకు మళ్లీ 28, 38 గేట్ల వద్ద సీపేజీ రావడంతో పాలీయురేతిన్ ఆర్గానిక్-కాంపౌండ్ పద్దతిలో కెమికల్ గ్రౌటింగ్ చేశారు. మళ్లీ 34, 45 గేట్ల వద్ద సీపేజీ రాగా దాన్నీ ఆరికట్టారు. తర్వాత వివిధ సంస్థలకు చెందిన కొందరు నిపుణులు వచ్చి పరిశీలించారు.