పవర్ కంపెనీకి లైమ్‌స్టోన్‌తో ఏం పని ? ఉత్పత్తి లేకుండానే షేర్ల ధరలు పెంపు: ఆనం వెంకటరమణారెడ్డి - Allegations on cm ys jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 3, 2024, 1:41 PM IST
Anam Venkataramana Reddy Allegations on CM Jagan: బ్లాక్‌మనీని వైట్‌గా మార్చడంలో జగన్ ఆరితేరిపోయారని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. సరస్వతి పవర్ పేరిట సీఎం వైఎస్ జగన్‌రెడ్డి, భారతిరెడ్డి దోచేశారని ఆరోపించారు. ఉత్పత్తే లేకుండా షేర్ల ధరలను విచ్చలవిడిగా పెంచేసుకున్నారని ఆనం ధ్వజమెత్తారు. అలాగే సిమెంట్ పరిశ్రమకు అనుమతి కూడా రాకముందే లైమ్‌స్టోన్ అనుమతులు ఇచ్చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఈ అక్రమాలతోనే జగన్‌రెడ్డి జైలుకు పోయారని ఆనం అన్నారు.
అసలు సరస్వతి పవర్ కంపెనీ అనేది ఎక్కడా కనిపించదన్న ఆనం, ఎలాంటి ఉత్పత్తి లేని కంపెనీ షేర్లు వేలల్లో ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. జగన్‌పై అక్రమాస్తుల కేసులు ఎందుకు ఉన్నాయో ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు. పవర్ ప్రొడక్ట్ కంపెనీకి లైమ్‌స్టోన్‌తో ఏం పని అని ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు. హెక్టార్‌కు ఏడాదికి 200 రూపాయల చొప్పున లైమ్‌స్టోన్ భూములు లీజుకు ఇచ్చారని, భూములు కోల్పోయిన రైతులు ఉపాధి, పరిహారం అడిగితే దాడులు చేశారని ఆరోపించారు. అమర్‌రాజా కంపెనీకి సైతం భూములు ఇచ్చి వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు.