ఏనుగులను కాపాడిన గ్రామస్థులు- ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా! - VILLAGERS SAVED STRANDED ELEPHANTS
Published : Dec 12, 2024, 6:02 PM IST
Villagers Saved Elephants : అసోంలో చెరువులో చిక్కుకున్న ఐదు అడవి ఏనుగులను స్థానికులు రక్షించారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా గజరాజులను రక్షించారు. దీంతో వారిపై జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
జోర్హాట్ జిల్లాలోని ఖమ్ జాంగియా అనే గ్రామానికి ఆహారం కోసం వెతుక్కుంటూ ఓ తల్లి ఏనుగు, దాని నాలుగు పిల్లలు వచ్చాయి. ఈ క్రమంలో లోతైన చెరువులో చిక్కుకున్నాయి. బురద నీటిలో చిక్కుకోవడం వల్ల బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి గజరాజులు ఇబ్బంది పడుతున్నాయి. ఏనుగుల ఆర్తనాదాలు విన్న స్థానికులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే స్థానికుల ఫిర్యాదులపై అటవీశాఖ స్పందించలేదు.
గంటలపాటు శ్రమించి!
ఎంతసేపటికి ఫారెస్ట్ అధికారులు రాకపోవడం వల్ల బురద నీటిలో చిక్కుకున్న ఏనుగులను రక్షించాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా కొందరు పారలతో ఎత్తైన చెరువు గట్టును కొన్ని గంటలపాటు శ్రమించి తవ్వారు. అప్పుడు చెరువులోని నీరు బయటకు వెళ్లిపోయింది. దీంతో తల్లి ఏనుగు సహా మిగతా గజరాజులన్ని సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి. ఈ ఘటనలో అటవీశాఖ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాలను రక్షించడానికి రాకపోవడంపై ఫారెస్ట్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.