YouTube Premium Lite Subscription:ప్రపంచంలోని వీడియో ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలో యూట్యూబ్‌కు ఉన్న క్రెేజ్ వేరే లెవల్. ఈ యాప్ లేని మొబైల్ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు తన ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తక్కువ యాడ్స్‌తో కొత్త ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చే పనిలో పడిందని సమాచారం.
Jonahmanzano అనే యూజర్ థ్రెండ్స్ పోస్ట్ ప్రకారం.. యూట్యూబ్ నెలకు $8.99లతో ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇది $16.99 ఖరీదు చేసే దాని సాధారణ ప్రీమియం ప్లాన్ కంటే దాదాపు 50 శాతం తక్కువ. అయితే యూట్యూబ్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై ప్రస్తుతం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ ఇండియాలో తీసుకొస్తారా లేదా అనే దానిపై కూడా ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు.
యూట్యూబ్ రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ నెలకు రూ.149 ఉండగా.. దేశంలో ఈ కొత్త ప్రీమియం లైట్ సర్వీస్‌ను ప్రారంభిస్తే దాదాపు రూ.75కు అందుబాటులో ఉండొచ్చు. ఈ యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్స్ కంటెంట్ వీక్షిస్తున్నప్పుడు తక్కువ యాడ్స్ పొందుతారు. The Verge నివేదిక ప్రకారం యూట్యూబ్ ప్రస్తుతం జర్మనీ, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా వంటి ఎంపిక చేసిన మార్కెట్స్‌లో ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం.